రైతులు పొగాకుబోర్డు పరిమితి మేరకే పంటపడించాలని పొగాకుబోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. దేవరపల్లి పొగాకుబోర్డులో పొగాకుపంట నియంత్రణ, ప్రత్యామ్నాయ పంట సాగుపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రపంచ పొగాకు మార్కెట్‌లో మన ప్రాంత పొగాకుకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఈ ఏడాది జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాల్లో పొగాకు ఉత్పత్తి తగ్గిందని మన దేశంలో పొగాకుకు మంచి ధర పలికిందన్నారు. అనుకూలంగా ఉన్న నేలల్లోనే పంట వేయాలని రైతులకు సూచించారు.ప్రపంచంలో పొగాకు పంట నియంత్రణకు భారతదేశం కూడా ఒప్పంద సంతకం చేసిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు పంటను తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులు సాగు చేయాలన్నారు.కర్ణాటకలో కూడా ఈ ఏడాది అధికంగా పొగాకు పంట వేశారని గుర్తు చేశారు.పొగాకు బోర్డు ఆర్‌ఎం పీఎల్‌కే ప్రసాద్ మాట్లాడుతూ..... బోర్డు పరిమితి కంటే ఎక్కువ పొగాకు సాగు చేస్తే రైతులపై చర్యలు తప్పవన్నారు. గోపాలపురంలోని పొగాకు బోర్డును పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్, ఆచంట గోపాలకృష్ణ, రైతు సంఘం అధ్య క్షుడు ఇల్లూరి రాము తదితర రైతులు ఉన్నారు.