అంబేద్కర్ విగ్రహంపై దాడి ఘటన ద్వారా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల నైజం మరోసారి బయటపడిందని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆక్షేపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మధ్యాహ్నం నుంచి మనుషుల్ని కొట్టి చంపడం, మహిళలపై అమానుషాలతో పాటు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వేటకొడవళ్లుతో వెంటపడి చంపడం, కిడ్నాపులు వంటి ఘటనలన్నీ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, కిడ్నాప్ల వంటి అకృత్యాలకు పాల్పడుతుందన్నారు. హామీల అమలు చేయడానికి కమిటీ వేస్తామని లోకేష్ చెబుతున్నారని.. హామీ ఇచ్చినప్పుడే ఆ కమిటీ వేసుంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తుందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం బయటపడిందన్నారు. హామీల అమలు చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి దాడులు, అఘాయిత్యాలు చేస్తూనే ఇంకా కడుపు మంట చల్లారక ఏకంగా మహానుభావుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహంపైన దాడికి దిగడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు.ఒకప్పుడు తుళ్ళూరు ప్రాంతంలో ఐనవోలు గ్రామంలో మురికికూపంలో కేవలం ఎస్సీలు, బీసీలు ఓట్లుకోసమే విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి.. చివరికి పౌండేషన్ వేయకుండానే ఐదేళ్లు పబ్బం గడిపిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాల్సిన చోటు అది కాదని.. ఏకంగా విజయవాడలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి ఆ విగ్రహంపై అక్కసు వెళ్లకక్కుతున్నారని మండిపడ్డారు. గతంలోనే టీడీపీ అధికారంలోకి రాకముందే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని పొన్నూరు శాసనసభ్యుడి వ్యాఖ్యలను ఈ సందర్బంగా గుర్తుచేశారు. చివరికి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడిని కించపరిచే చర్యలు చేస్తున్నారని.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి నోరు నొక్కాలని చేస్తున్న అధికార పార్టీ తీరుపై భయపడేది లేదని సురేష్ తేల్చిచెప్పారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ దేశం మొత్తం తెలిసేలా చేస్తామన్నారు. నిన్నటి ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని నందిగం సురేష్ స్పష్టం చేశారు.