అతి త్వరలోనే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించిన వంగలపూడి అనిత.. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై వంగలపూడి అనిత క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. గంజాయి నిర్మూలనపైనా స్పెషల్ ఫోకస్ పెట్టామన్న వంగలపూడి అనిత.. అతి త్వరలోనే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
మరోవైపు రాజమండ్రి జైలు పరిశీలన సందర్భంగా హోం మంత్రి కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అప్పట్లో అన్యాయంగా 53 రోజుల పాటు జైళ్లో ఉంచారని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజులు గుర్తుకువస్తే బాధ వేస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో పెట్టిన అక్రమ కేసులకు టీడీపీ అధినేత కూడా బాధితులు అయ్యారన్న హోం మంత్రి.. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి దిగజారాయన్నారు. మరోవైపు ఆగస్ట్ 15 సందర్భంగా ఖైదీల విడుదలపైనా హోం మంత్రి స్పందించారు. ఈసారి ఆగస్ట్ 15కు క్షమాభిక్ష ఖైదీల విడుదల ఉండదన్న వంగలపూడి అనిత.. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన ఖైదీలను విడుదల చేస్తామన్నారు.
వైఎస్ జగన్ సెక్యూరిటీని తగ్గించారనే వార్తలపైనా హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టత ఇచ్చారు. వైఎస్ జగన్ భద్రతను తగ్గించలేదన్న అనిత.. నిబంధనల మేరకు సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న వంగలపూడి అనిత.. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని జగన్ భయపడుతున్నారని విమర్శించారు. ఏపీలో 20 వేల మంది పోలీసుల కొరత ఉంటే.. 900 మందితో వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం ఎలా సాధ్యమని ఏపీ హోం మంత్రి ప్రశ్నించారు. పోలీసుల కొరతను అధిగమించేందుకు త్వరలోనే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వంగలపూడి అనిత వెల్లడించారు,