భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే ఆగస్ట్ 16వ తేదీన మిగతా 99 క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. మొత్తం 33 మున్సిపాలిటీలలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అన్న క్యాంటీన్ల నిర్వహణను హరే రామ హరే కృష్ణ సంస్థ చూడనుంది.
కేవలం ఐదు రూపాయలకే ఉదయం అల్ఫాహరం, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అందించనున్నారు. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ అన్న క్యాంటీన్లను తీసుకువచ్చారు. నిరుపేదలకు తక్కువ ధరకే మూడు పూటల భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావటంతో.. ఈ అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే తిరిగి అన్న క్యాంటీన్లు తెరుస్తామని చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. గెలిచి అధికారంలోకి రాగానే.. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకం కూడా చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ ఆమోదం కూడా పొందడంతో అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటున్నాయి.
అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటూ ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. రోజువారీ కూలీలు, కార్మికులకు అన్న క్యాంటీన్లు ద్వారా ఆకలి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద అన్న క్యాంటీన్లు ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా..మరో 83 అన్న క్యాంటీన్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కొత్తగా అన్న క్యాంటీన్ల కోసం నిర్మాణాలు చేపడుతున్న కారణంగా.. పలుచోట్ల ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొత్తం 213 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.