ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్ వెళ్లి జీరో నుంచి వేల కోట్లకు అధిపతిగా..లులు ఫౌండర్ సక్సెస్ స్టోరీ

national |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 10:22 PM

ఈ రోజుల్లో లులు మాల్ అంటే తెలియని వారుండకపోవచ్చు. ఇదో హైపర్‌మార్కెట్ చెయిన్. తొలుత గల్ఫ్ దేశాల్లో తర్వాత భారత్‌కు ఇది విస్తరించింది. ఇక దీనిని తొలుత గల్ఫ్ దేశాల్లో లాంఛ్ చేసినప్పటికీ.. స్థాపించిన వ్యక్తి మన భారతీయుడే. ఏదో ఒక పని చేసుకుందామని కేరళ నుంచి దుబాయ్ వెళ్లిన భారతీయ యువకుడు అరబ్ షేక్స్‌నే షేకాడిస్తూ.. వేల కోట్లకు అధిపతి అయ్యారు. లులు ఇంటర్నేషనర్ గ్రూప్ స్థాపించి. 22 దేశాలకుపైగా.. 215 రిటైల్ స్టోర్లు, 50 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆయనే లులు గ్రూప్ ఫౌండర్, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ. యూసుఫ్ అలీ. ఒట్టి చేతులతో ఎడారి దేశంలో అడుగుపెట్టిన కేరళ వాసి.. అక్కడ పెద్ద సామ్రాజ్యమే స్థాపించారు. దీని వెనుక ఎన్నో కన్నీళ్లు.. కఠోర శ్రమ.. ఎనలేని ధైర్యం, తెలివితేటలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈయన జీవిత ప్రస్థానం సినిమా కథనే తలపిస్తుంది.


>> కేరళలోని త్రిస్సూర్ తీర ప్రాంతంలోని నట్టికా అనే గ్రామంలో 1955, నవంబర్ 15న యూసుఫ్ అలీ జన్మించారు. తండ్రి అబ్దుల్ ఖాదిర్ గుజరాత్‌కు వలస వెళ్లి.. అక్కడ కిరాణా కొట్టు నడుపుతుండేవాడు. యూసుఫ్ బాగోగుల్ని తాత కుంజహమ్ము హాజీ చూసుకునేవాడు. చిన్నప్పట్నుంచే యూసుఫ్‌కు వ్యాపార నైపుణ్యాలు ఒంటబట్టాయి. సినిమాల్లో వాదించే న్యాయవాదుల్ని చూసిన తర్వాత.. ఆ వృత్తిలోకి వెళ్లాలన్న ఉబలాటం కలిగింది. హైస్కూల్ చదువు పూర్తయ్యాక.. సమ్మర్ హాలిడేస్‌ల్లో అహ్మదాబాద్ వెళ్లి తండ్రి కిరాణా దుకాణంలో కూర్చొని సహాయపడేవాడు. పెట్టుబడులు, ఇతర లాభాల లెక్కలు అన్నీ బాగా చూస్తుండటంతో.. యూసుఫ్‌ను బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేర్పించాడు ఆయన తండ్రి.


యూసుఫ్‌కు 18 ఏళ్లు నిండాక.. కోర్సు పూర్తయినా ఉద్యోగం రాలేదు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న మనవడ్ని చూసి తాత ఎంతో ఆవేదన చెందేవాడు. బంధువులంతా కూడా గల్ఫ్‌కు వెళ్లడం వల్ల యూసుఫ్‌లో కూడా కుతూహలం కలిగింది. ఈ క్రమంలోనే అబుదాబిలోని ఒక బంధువుకు యూసుఫ్ గురించి అతని తల్లి సఫియా చెప్పింది. అతడ్ని అక్కడికి పంపిస్తే ఏదో ఒక జాబ్ చూస్తానని.. బంధువు హామీ ఇవ్వడంతో యూసుఫ్‌ను అరబ్ దేశం పంపాలని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులు.


ఇలా కేరళ నుంచి 5 రోజులు ఓడలో ప్రయాణించి పోర్ట్ రషీద్‌కు చేరుకున్నారు యూసుఫ్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అబుదాబికి వెళ్లి బంధువును కలుసుకున్నాడు. 3 సంవత్సరాలు కిరాణా షాపులో పనిచేస్తూ.. సరకుల ఎగుమతి, దిగుమతులపై అవగాహన పెంపొందించుకున్నారు. ఆ ప్రాంతంలో ఏ వస్తువు చౌకగా దొరుకుతుందో తెలుసుకొని షాపులో కూర్చునే కంటే ఆ వ్యాపారం చేస్తే మంచిదనుకున్నారు. అప్పుడే యూసుఫ్‌కు షబీరా అనే యువతితో పెళ్లయింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టగా.. అక్కడి నుంచి ఆయన దశ తిరిగింది.


>> ఆ సమయంలోనే సూపర్ మార్కెట్స్ ట్రెండ్ ప్రారంభం కావడంతో.. హాంకాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించి వాటి నిర్వహణ గురించి తెలుసుకున్నారు. దీంతో అబుదాబిలో అలాంటి సూపర్ మార్కెట్ ప్రారంభించాలన్న ఆలోచన పుట్టింది. సంవత్సరం శ్రమించి.. 1990ల్లో ఎమిరేట్స్ జనరల్ మార్కెట్ పేరిట ఒక సూపర్ మార్కెట్ ప్రారంభించారు. అప్పుడే కువైట్‌పై ఇరాక్ దాడి చేయడంతో.. గల్ఫ్‌లో యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎందరో స్వస్థలాలకు చేరినా.. భయపడిన నాన్నకు ధైర్యం చెప్పి.. తాను అక్కడే ఉంటానని చెప్పి ఉండిపోయాడు.


>> సూపర్ మార్కెట్ ప్రారంభించడంతోనే కష్టాలు మొదలయ్యాయి. వ్యాపారంలో అంతరాయాలు.. ఇంటినుంచి తల్లిదండ్రుల ఫోన్లు.. ఇరాక్‌పై అమెరికా ప్రయోగించిన క్షిపణి అదుపుతప్పి దుబాయ్‌పై పడుతుందన్న వదంతులతో గల్ఫ్ భారతీయులంతా స్వదేశానికి తిరిగివచ్చారు. యూసుఫ్ మాత్రం ఆశ వదులుకోకుండా.. అక్కడ సూపర్ మార్కెట్స్ నెలకొల్పి ధైర్యంగా నిల్చోవడం అబుదాబి రాజ కుటుంబీకుల్ని ఆశ్చర్యపరిచింది. అప్పుడే పలుకుబడి ఉన్న షేక్‌లతో యూసుఫ్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. రాజ కుటుంబీకుల్ని కలిసే అవకాశాలు కూడా వచ్చాయి.


క్రమక్రమంగా యుద్ధ మేఘాలు తేలిపోవడంతో.. యూసుఫ్ వ్యాపారాలు జోరందుకున్నాయి. లాభాలు బాగా రావడంతో.. 1995లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నెలకొల్పి.. అబుదాబిలో లులు బ్రాండ్ పేరిట అతిపెద్ద సూపర్ మార్కెట్ ప్రారంభించారు. ఐదేళ్లలోనే అంటే 2000లో దుబాయ్‌లో కూడా లులు హైపర్ మార్కెట్ స్టోర్ తెరిచారు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఖతార్, యూఏఈ, సౌదీ, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఈజిప్ట్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, యెమన్ వంటి దేశాల్లో షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంట్ స్టోర్లు, సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ స్టోర్లు నెలకొల్పారు.


>> ఇక సూపర్ మార్కెట్స్ వ్యాపారంతోనే ఆగక.. ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి- దిగుమతులు, ఆతిథ్యం లాంటి రంగాలకు ఎగబాకాడు యూసుఫ్. పట్టిందల్లా బంగారం కావడంతో కొన్నేళ్లలోనే వేల కోట్ల అధిపతిగా మారాడు. అరబ్ షేక్స్ ఆశ్చర్యపోయేలా కార్పొరేట్ సామ్రాజ్యం విస్తరించారు. సొంత రాష్ట్రం కేరళలోని కొచ్చిలో 17 ఎకరాల్లో అతిపెద్ద లులు మాల్ నిర్మించారు. దేశంలో కొచ్చి తర్వాత.. బెంగళూరు, తిరువనంతపురం, పాలక్కడ్, కోజికోడ్, లక్నో, హైదరాబాద్ నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటు చేశారు. సాధారణ వ్యక్తిలా అరబ్ దేశానికి వెళ్లి.. కిరాణా షాపులో పనిచేసిన వ్యక్తి.. అక్కడ వేల కోట్ల సామ్రాజ్యం నెలకొల్పారంటే.. భారతీయులుగా గర్వించాల్సిన విషయం. ప్రస్తుతం ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. ఆయన సంపద సుమారు రూ. 72 వేల కోట్లకుపైగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com