వైఎస్సార్‌సీపీ ఎంపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అరకు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన తనూజరాణి ఎన్నికను సవాలు చేస్తూ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ చంద్రమౌళి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తనూజరాణితో పాటు రిటర్నింగ్ అధికారి, ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
వైఎస్సార్‌సీపీ తరఫున అరకు ఎంపీగా గెలిచిన తనూజరాణి ఎన్నికల అఫిడవిట్‌లో వాస్తవాలను పొందుపరచలేదని కొత్తపల్లి గీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సైతం సక్రమంగా జరగలేదని.. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. అందుకే ఈ పిటిషన్‌ను పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలని కొత్తపల్లి గీత పిటిషన్‌లో ప్రస్తావించారు.
తనూజ రాణి అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలు.. అయితే 2019 ఎన్నికల్లో పాల్గుణ అరకు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో అరకు టికెట్ దక్కలేదు.. రేగ మత్స్యలింగంకు ఆ అవకాశం దక్కింది. దీంతో పాల్గుణ కోడలు తనూజకు ఎంపీగా అవకాశం ఇచ్చారు.. ఆమె వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. తనూజ రాణి డాక్టర్ కాగా.. పాల్గుణ కుమారుడు వినయ్‌తో వివాహం అయ్యింది.. వారికి ఓ పాప కూడా ఉంది. అనుకోకుండా వచ్చిన అవకాశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.. అరకు నుంచి ఎంపీగా విజయం సాధించారు.
తనూజ రాణికి పోటీగా కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీచేసి 50వేల 580 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తనూజ ఎన్నికను గీత హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొత్తపల్లి గీత 2014 లో అరకు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.. అప్పట్లో ఆమె ఎన్నికపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది.