కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ కాలనీకి చెందిన కొంచాడ నీలమ్మ (22) అనే పీజీ విద్యార్థిని డెంగ్యూతో మంగళవారం మృతి చెందింది. నీలమ్మ పీజీ వరకు చదివి విజయనగరంలో పోటీ పరీక్షలు కోసం కోచింగ్ తీసుకుంటుంది. ఈనెల 1న ఇంటికి వచ్చిన ఆమెకు జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నాయని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. టెక్కలి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు నీలమ్మను నరసన్నపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ సోకిందని, భారీగా ప్లేట్‌లెట్స్ పడిపోయాయని, శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం నీలమ్మ మృతి చెందిందని తల్లిదండ్రులు హరి, యర్రమ్మ రోదిస్తున్నారు. నీలమ్మ ఒక్కరే సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచా మని, కూలీనాలీ చేసి చదివించామని, ప్రయోజకురాలు అవుతుంది అనుకున్నలోపే తమకు దేవుడు అన్యాయం చేశాడని కన్నీటిపర్యంతమవుతున్నారు. నీలమ్మ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ విషయంపై నిమ్మాడ పీహెచ్‌సీ వైద్యాధికారి సురేష్ వివ రణ కోరగా.. ‘నీలమ్మ ఈనెల 10న చికిత్స కోసం ఆసుప్ర తికి వచ్చింది. రక్తపరీక్షలు నిర్వహించి ప్లేట్‌లెట్స్ 90వేలు ఉన్నాయని చెప్పాం. టెక్కలి జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించాం. వారు టెక్కలికి వెళ్లలేదు.’ అని తెలిపారు.