రోజురోజుకూ పట్టణీకరణ పెరిగి అరణ్యాలు తగ్గిపోతున్నాయి. దీంతో దిక్కు తోచని వన్యప్రాణులు జనవాసాల్లోకి చొరబడుతున్న ఘటనలు అప్పుడప్పుడూ మనం చూస్తూనే ఉన్నాం, తాజాగా విశాఖపట్నంలోనూ ఇలాంటి ఘటనే ఎదురైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. ఎంచక్కా రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఇక ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు. అలాగే బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు కూడా పాము సంగతి తెలిసీ బ్యాంకు బయటకు పరుగులు తీశారు.
ఇక రికార్డు రూములోకి పాము దూరిన సంగతిని బ్యాంకు సిబ్బంది వెంటనే పాములు పట్టే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న కిరణ్ అనే స్నేక్ క్యాచర్.. చాకచక్యంగా ఆ పామును బంధించాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సకాలంలో స్పందించి సమాచారం ఇచ్చిన వెంటనే బ్యాంకుకు వచ్చిన స్నేక్ క్యాచర్ కిరణ్‌ను బ్యాంకు సిబ్బంది అభినందించారు. బ్యాంక్ మేనేజర్.. స్నే్క్ క్యాచర్ కిరణ్‌కు ప్రశంసా పత్రం కూడా అందించారు.
మరోవైపు రికార్డు రూమ్‌లో ఉన్న పామును బంధించి.. బయటకు తీసుకువస్తున్న కిరణ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజనం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అటవీశాఖ గైడ్ లైన్స్ ప్రకారం పాములు పట్టే స్నేక్ క్యాచర్లు.. తగిన పరికరాలను ఉపయోగించి పాములను బంధించాలి. పాములను పట్టే సమయంలో అవి కాటేసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హ్యాండ్ గ్లవ్స్‌తో పాటుగా పలు సాధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే కిరణ్ అవేమీ లేకుండా సాదాసీదాగా చేత్తో పామును పట్టుకుని రావడం ప్రమాదకరమని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో విషయం తెలిసిన వెంటనే వెళ్లి బంధించడం గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు.