ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు. 2025 చివరికల్లా అన్ని ప్రభుత్వ ఆఫీసుల మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ నెడ్ క్యాప్, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. 2025 చివరి నాటికి గవర్నమెంట్ కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేలా.. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్.. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం జరిగినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.
సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌరశక్తి వినియోగం కారణంగా విద్యుత్ ఆదా కావటంతో పాటుగా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. 25 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకోవడం ద్వారా.. సౌర విద్యుత్ ఖర్చు తక్కువగా ఉండటంతో పాటుగా..దీర్ఘకాలంలో పెద్ద పొదుపుగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భవనాల్లో 300 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి రూ. 118.27 కోట్లు ఆదా అవుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ లెక్కన 25 సంవత్సరాలలో రూ. 2957 కోట్లు ఆదా అవుతుందన్నారు. అలాగే కర్బన ఉద్గారాలను కూడా ఏడాదికి 3.41 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గించవచ్చని.. ఈ లెక్కన వచ్చే పాతికేళ్లలో 85.25 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గించవచ్చంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు అదిల్ జైనుల్‌భాయ్ నేతృత్వంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులలో నైపుణ్యం మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికత సాయంతో ఏపీలో ట్రైనింగ్ విధానాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే అమరావతిలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటుపై సీబీసీ సహకారం అందించాలని చంద్రబాబు కోరారు.