ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులకు సంబంధించి డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతిరోజూ డీజీపీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వెయిటింగ్‍లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని అధికారులు.. ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో ఉండాలని స్పష్టం చేశారు. వెయిటింగ్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ మేరకు మెమోలు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్‌కుమార్, సంజయ్, కాంతిరాణా టాటా, విజయరావు, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విశాల్‌గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, కృష్ణకాంత్ పటేల్, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. సాయంత్రం విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని డీజీపీ మెమోలో స్పష్టం చేశారు.మరోవైపు అనంతపురం జేసీగా డి. హరితకు ఇచ్చిన పోస్టింగును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డి. హరితను అనంతపురం జేసీగా నియమిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పోస్టింగును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరితను ఆదేశించింది.
మరోవైపు కేంద్రం డిప్యుటేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. పోలీస్ ఆర్గనైజేషన్ ఐజీగా ఆకే రవికృష్ణకు పోస్టింగ్ ఇస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్‌కు బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశాలిచ్చింది. మరోవైపు గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు వీలుగా ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది. దీని బాధ్యతలను ఆకే రవికృష్ణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.