విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ‘‘జగన్ అధికారంలోకి రాగానే పేదల నోటి వద్ద కూడు తీసేశారు... ఆరోజు మేమంతా జగన్‌ను అర్ధించాం . పేరు మార్చుకుని అయినా నడపాలని కోరాం. అసెంబ్లీ సాక్షిగా ఆందోళన చేసినా జగన్‌కు పేదలపై కనికరం కలగలేదు. తమిళనాడులో స్టాలిన్ అమ్మ క్యాంటీన్లను యధావిధిగా నడిపారు. జగన్ పైశాచికత్వంతో పేదలకు అన్నం లేకుండా చేశాడు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించారని.. త్వరలోనే మరో రెండు వందల క్యాంటీన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. నెలకు 450 రూపాయలకే ఒక పేదవానికి ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.