బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి స్వర్గీయ గౌతు లచ్చన్న పాటుపడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు కీర్తించారు. శుక్రవారం నాడు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి. ఈ సందర్భంగా శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద లచ్చన్న విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి అచ్చెన్నాయుడు.. గౌతు లచ్చన్న సేవలను స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం లచ్చన్న ఎంతో చేశారని అన్నారు. రైతుల కోసం శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేశారన్నారు. సిద్ధాంతం కోసం చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కీర్తించారు. గౌతు లచ్చన్నకు కులం లేదు మతం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా గెలుపొందిన వ్యక్తి లచ్చన్న అని పేర్కొన్నారు. తమలాంటి నాయకులెందరికో లచ్చన్న ఆదర్శం అని మంత్రి చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి తరం నేతలంతా కలిసి పని చేస్తామని అన్నారు. ఎన్జీ రంగాకు శిష్యుడిగా రాజకీయం చేశారని అన్నారు. ఎన్జీ రంగా కోసం తన పదవినే వదిలేశారన్నారు. అలాంటి సర్దార్ లచ్చన్నను గత ప్రభుత్వం అవమానించిందని మంత్రి అచ్చెన్న ఫైర్ అయ్యారు. అసలు లచ్చన్నకు సర్దార్ బిరుదు ఇవ్వలేదని అన్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. అలా విర్రవీగిన నేతలకు జిల్లా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని మంత్రి వ్యాఖ్యానించారు. తోటపల్లి బ్యారేజ్‌కు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.