ఆగస్ట్ 27వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏపీ కేబినెట్ భేటీ కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లెస్ కేబినెట్ మీటింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 27వ తేదీ కూడా కాగిత రహిత కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. పేపర్లకు బదులుగా మంత్రులకు ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు ఇవ్వనున్నారు. అయితే 2017లోనూ చంద్రబాబు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కేబినెట్ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.. అదే పద్ధతి ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి గత మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని.. మంత్రులకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారమే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశాన్ని కాగిత రహితంగా నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అజెండా ప్రకారం ప్రతి కేబినెట్ భేటీకి 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్నారు. దీనివల్ల ప్రింటింగ్ ఖర్చులు అధికమవుతున్నట్లు చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రులకు ఐప్యాడ్‌లు అందించి.. నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీల రూపంలో అందజేస్తే ప్రింటింగ్ ఖర్చులు ఆదా అవుతాయనే ఆలోచనతో పాటుగా మంత్రివర్గంలో చర్చించే అంశాలు లీక్ కావనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో నూతన మద్యం విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఎక్సైజ్ అధికారులు కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించి, మద్యం నాణ్యత, ధరలు, ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేశారు. దీనిపై నివేదికను కూడా అందించారు. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే హామీల అమలుపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.