బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆ దేశంలోనే కాకుండా భారత్‌లో కూడా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం.. బంగ్లాదేశ్‌లో ఉన్న మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. మహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసినట్లు మోదీ వెల్లడించారు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన విషయాన్ని మోదీ.. ట్వీట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసి హామీ ఇచ్చారని తాజాగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మహమ్మద్ యూనస్ నుంచి టెలిఫోన్ కాల్ వచ్చిందని.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్.. పూర్తిగా మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ భరోసా ఇచ్చారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ, భద్రతకు మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఈ క్రమంలోనే మహమ్మద్ యూనస్.. ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసంపై హిందువులు ఆయన సంప్రదించి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాకాండలో మైనారిటీలపై దాడులు జరుగుతున్న ఘటనల్లో నిందితులను శిక్షిస్తామని వారికి మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు.
ఇక గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదిక నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. పక్క దేశంలో ఉన్న హిందువులు, మైనారిటీల భద్రతపై భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నందున హింసాత్మక బంగ్లాదేశ్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.