ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్టకముందే 3 సార్లు కూలిన వంతెన,,,9 ఏళ్లుగా సాగుతున్న బ్రిడ్జి నిర్మాణం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 10:33 PM

బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు పెరుగుతుండటం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ బ్రిడ్జిలు అంటేనే సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వాటికి మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఈ బ్రిడ్జి 9 ఏళ్లుగా నిర్మిస్తుండటం గమనార్హం. పైగా ఇప్పటికే రెండు సార్లు ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే కుప్పకూలగా.. తాజాగా మూడోసారి కూలిపోయింది. దీంతో మరోసారి బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనలపై నితీష్ కుమార్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బీహార్‌లోని ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన కుప్పకూలిపోయింది. ఇక ఆ వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు స్థానికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్ గంగా పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలోని కొంత భాగం ఒక్కసారిగా గంగానదిలో కూలిపోయింది. అయితే ఈ వంతెన కూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.


అయితే ఈ వంతెన కూలిపోవడం ఇప్పటికి మూడోసారి అని స్థానికులు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు కూలిపోగా.. తాజాగా మరోసారి కూలినట్లు పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో బీహార్‌లో సంభవించిన తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. ఇక అగువాని సుల్తాన్‌గంజ్ గంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం రూ.1717 కోట్లు కేటాయించింది. ఇక ఖగారియా- అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై నిర్మించే ఈ అగువాని సుల్తాన్‌గంజ్ గంగా ప్రాజెక్టుకు 2015లో నితీషీ కుమార్‌ శంకుస్థాపన చేశారు. అయితే 2020 నాటికి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక ఒకే వంతెన నిర్మాణం పూర్తికాకముందే 3 సార్లు కూలడంతో నిర్మాణంలో నాణ్యత, ప్రాజెక్టు అమరికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి


ఇక బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకముందే మూడుసార్లు వంతెన కూలిపోవడంతో బీహార్‌లోని ప్రతిపక్షాలు నితీష్ కుమార్‌ సర్కార్‌పై తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా ఈ బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. ఆ బ్రిడ్జిని నిర్మిస్తున్న ఎస్‌ కే సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చర్యలు చేపట్టింది. ఆ సంస్థకు భారీగా జరిమానా విధించింది. ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని సొంత ఖర్చుతో మళ్లీ నిర్మించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


2022 డిసెంబర్‌లో కూడా బీహార్‌లోని బెగుసరాయ్‌ ప్రాంతంలో బుర్హి గండక్‌ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది నవంబరులో సీఎం నితీష్ కుమార్‌ సొంత జిల్లా నలందలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన ఘటనలో ఒక కూలీ మృత్యువాత పడగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతకుముందు కిషన్‌గంజ్‌, సహర్‌సా జిల్లాలో ప్రారంభానికి ముందే రెండు బ్రిడ్జిలు కూలిపోయాయి. ఇక బీహార్‌లో బ్రిడ్జిలు కుప్పకూలిపోతుండటంతో స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com