బ్యాంకు మేనేజర్ అంటే మంచి ఉద్యోగం. జీతం కూడా బాగానే వస్తుంది. కానీ ఆ వచ్చే జీతం సరిపోలేదు కావచ్చు.. ఆ బ్యాంకు మేనేజర్ ఓ పాడు పనికి పాల్పడ్డాడు. లోన్లు తీసుకునేందుకు కొందరు కస్టమర్లు.. బ్యాంకులో బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు. అయితే ఆ బంగారంపై కన్నేసిన ఆ బ్యాంకు మేనేజర్.. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అసలు నగలను పోలి ఉండేలా నకిలీ నగలు తయారు చేయించాడు. ఆ తర్వాత నకిలీ బంగారంతో చేసిన నగలను బ్యాంకులో ఉంచి.. అక్కడ ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే ఆ బ్యాంకు మేనేజర్ ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాంక్ మేనేజర్.. అవి నిజం నగలు కావని.. నకిలీ ఆభరణాలు అని గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ బ్యాంకు మేనేజర్ బాగోతం.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర్ బ్రాంచ్‌కు కొత్తగా వచ్చిన ఇర్షాద్ అనే మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. బ్యాంకులో ఉన్న బంగారం ఒరిజినల్ కాదని.. నకిలీదని గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణ జరపగా.. అంతకుముందు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసిన తమిళనాడుకు చెందిన మధు జయకుమార్ పనే అని తేల్చారు. దీంతో వడకర పోలీసులకు కొత్త బ్యాంక్ మేనేజర్ ఇర్షాద్ ఫిర్యాదు చేశారు.
ఇక బ్యాంకులో తాకట్టు పెట్టిన 26 కిలోల బంగారాన్ని మధు జయకుమార్ తీసుకెళ్లి.. దాన్ని స్థానంలో నకిలీ నగలను పెట్టాడని గుర్తించారు. వీటి విలువ ఏకంగా రూ.17 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వడకర బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన మధు జయకుమార్.. ఆ తర్వాత కొచ్చిలోని బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అయితే ఈ బ్యాంకు కుంభకోణం బయటికి రావడంతో మధు జయకుమార్ కనిపించకుండా పోయారు. అంతేకాకుండా అతని ఫోన్ కూడా స్వి్చ్ ఆఫ్ రావడంతో అతడే నిందితుడు అని పోలీసులు గుర్తించి.. గాలింపు చేపట్టారు.
అయితే 26 కిలోల బంగారం మాయం చేయడం వెనుక ఒక్క మేనేజర్ మధు జయకుమార్ మాత్రమే ఉన్నారా ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వడకర బ్రాంచ్‌లోని ఉద్యోగులందరి వాంగ్మూలాలను పోలీసులు త్వరలో నమోదు చేయనున్నారు. ఇక మధు జయకుమార్ 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు వడకర్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసి.. ఆ తర్వాత కొచ్చి బ్రాంచికి బదిలీ అయ్యారు. అయితే అతను చాలా రోజుల వరకు కూడా కొచ్చి బ్రాంచిలో జాయిన్ కాకపోవడం గమనార్హం.