తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన రిటైర్డ్ అధికారి కన్నయ్యనాయుడు నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన గేట్లు డిజైన్లు చేయించి పనులు మొదలు పెట్టారు. మూడు భాగాలుగా చేపట్టే ఈ ప్రక్రియలో మొదటి భాగాన్ని విజయవంతంగా కొద్ది సేపటి క్రితం పూర్తి చేశారు. గేటు అమరిక విషయంలో ఏపీ ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించింది. గేట్ అమరిక పరిణామాలను మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీటి ప్రవాహం ఉన్న సమయంలో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చడాన్ని చంద్రబాబు అభినందించారు. సమిష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన సిబ్బంది, కార్మికులు, అధికారులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో ముందుకు వచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పని మొత్తం పూర్తి అయ్యేవరకు సమన్వయంతో పనిచేసి సమస్యను పూర్తిగా అధిగమించాలని రాష్ట్ర అధికారులు, మంత్రులకు సీఎం సూచించారు.