ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. షికార్‌పూర్-బులంద్‌షహర్ రోడ్డులో ఓ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనలో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది ఓ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పని చేస్తుంటారు.
సోమవారం రాఖీ పండుగ ఉన్నందున ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్‌ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకొని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన కార్మికులు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.