రాఖీపండుగ వేళ అనకాపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథ పాఠశాలలోని విద్యార్థులు రెండు రోజుల క్రితం సమోసాలు తిన్నారు. అనంతరం.. అస్వసత్థకు గురయ్యారు. దీంతో నిర్వాహకులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 24 మంది విద్యార్థుల్లో ఏడుగురిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి, మిగతా 17 మందిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ముగ్గురు విద్యార్థులు కన్నుమూశారు.
చనిపోయినవారిని జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో వీరిని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు డీఈవో తెలిపారు. మరోవైపు కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు చనిపోవటం స్థానికంగా కలకలం రేపుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉందో లేదో చూసుకోకుండానే అందిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా కారణంగానే విద్యార్థుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అనకాపల్లి ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన జగన్.. ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని వైఎస్ జగన్ ఆరోపించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
అనకాపల్లి జిల్లా అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో విద్యార్థులు చనిపోవటంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనపై అనకాపల్లి కలెక్టర్ , ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.