ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 12 బూతులలో ఈవీఎంలు వెరిఫికేషన్, వీవీప్యాట్‌లను లెక్కించాలని ఆయన ఎన్నికల కమిషన్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఈసీ.. మాక్ పోలింగ్ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సమక్షంలో జిల్లా అధికారులు ఈవీఎంల వేరిఫికేషన్ చేపట్టనున్నారు. మాక్ పోలింగ్ పద్ధతిలో రోజుకు రెండు చొప్పున ఆగస్టు 24 వరకు వరకు మొత్తం 12 బూత్‌లలో ఈవీఎంలను వేరిఫికేషన్ చేయనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. బెల్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
అయితే, ఈ వేరిఫికేషన్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. బాలినేని పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ నెలకుంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ పద్ధతిలోనే వేరిఫికేషన్‌కి ఏర్పాట్లు చేయడం పై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల తనిఖీ, పరిశీలనకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయట పడే అవకాశం లేదని, ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తేగానీ తెలియదని ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఈసీ పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ఆయన ప్రధాన వాదన. ఇక, గతంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలైన ఓట్లను వీవీ ప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా కోరవచ్చని తెలిపింది. ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలను, వీవీ ప్యాట్ల స్లిప్పులను తనిఖీ చేయాలని సూచించింది.