ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్ని రోజులుగానో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్‌లైన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే ట్రాన్స్‌ఫర్లకు అనుమతి ఇచ్చారు.
పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, గనులు, పౌరసరఫరాల శాఖ, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, విద్యుత్, రవాణా, వాణిజ్య పన్నులు, స్టాంపులశాఖతో పాటుగా అన్ని శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా సెప్టెంబర్ ఐదు నుంచి 15 వరకూ బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఉపాధ్యాయులు, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయం, వెటర్నరీ శాఖల్లో మాత్రం ప్రస్తుతం బదిలీలకు అనుమతి లేదు. ఇక ఐదేళ్లపాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
మరోవైపు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని జీవోలు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు సమాచారం. అయితే తాజాగా ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావటంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై స్పష్టత వచ్చింది. ఇక ప్రస్తుతం ఐదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీలు చేయనున్నారు. 2024 జులై 31వ తేదీ నాటికి ఐదేళ్లుగా ఒక్కచోట ఉద్యోగంలో ఉన్నవారిని బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నారు.