అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. బుదవారం ఉదయం టెక్సాస్‌లోని లంపాస్ కౌంటీ వద్ద జరిగిన కారు ప్రమాదం దంపతులతో పాటు వారి 17 ఏళ్ల కుమార్తె మృతిచెందారు. టెక్సాస్‌లోని లియాండర్‌లో నివాసం ఉండే భారత సంతతికి చెందిన అరవింద్ మణి (45), ఆయన భార్య ప్రదీప అరవింద్ (40), వారి కుమార్తె ఆండ్రిల్ అరవింద్ (17) బుధవారం ఉదయం 5.45 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవదహనమయ్యారు. అరవింద్ దంపతులు తమ కుమార్తెను కాలేజీకు తీసుకెళ్తండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడు అదిర్యన్ అరవింద్ (14)ను ఇంటి వద్దే ఉండిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అరవింద్, భార్య ప్రదీప్ తమ కుమార్తెను ఉత్తర టెక్సాస్‌లోని కాలేజీకి తీసుకువెళుతున్నారు. రౌస్ హైస్కూల్‌లో ప్లస్ టూ విద్య పూర్తిచేసిన ఆండ్రిల్ డల్లాస్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాలని అనుకుంది. ఈలోగా ఘోరం జరిగిపోయింది. బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం కోసం గోఫడ్‌మీ పేజ్‌లో విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకూ 7 లక్షల డాలర్లకుపైగా విరాళాలు వచ్చాయి. తల్లిదండ్రులు, తోబట్టువును కోల్పోయి ఒంటరైన అదిర్యన్‌ను ఆదుకోడానికి దాతలు తమవంతు సాయం చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో అరవింద్ కుటుంబం, మరో వాహనం డ్రైవర్‌తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన తర్వాత కారు మంటల్లో చిక్కుకుందని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘నా 26 ఏళ్ల సర్వీసులో చూసిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇదీ ఒకటి.. ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు’ అని అన్నారు.
ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన వాహనం 160 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని అధికారులు చెప్పారు. వారి కారు మాత్రం 112 కిలోమీటర్ల వేగంతో నడపడం వల్ల గంటకు 270 కి.మీ. వేగంతో కాంక్రీట్ గోడను ఢీకొట్టినట్టయ్యిందని పేర్కొన్నారు. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి.. క్షణాల్లో వారంతా కాలిబూడిదయ్యారని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు.