ఎన్నికల ముందు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చంద్రాబాబు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. త్వరలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చలు జరగనున్నాయి. కాగా ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే.. రద్దీ పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో అదనంగా బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా.. మిగిలినవి అద్దె బస్సులు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలువస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమవుతాయని అధికారులు అంచనావేశారు. ఈ పథకంతో రాష్ట్రంలో ఆర్టీసీకి ప్రతి నెల సుమారు రూ. 250 కోట్ల ఆదాయం తగ్గే అవకాశముంది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే ఆదాయంలో 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకపోగా.. తిరిగి అదనంగా నెలకు సుమారు రూ.125 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా.. కాగా ఈరోజు జరుగుతున్న సమీక్షలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.