ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మండిపడ్డారు. బుధవారం అమరావతిలో కె.ఎస్.జవహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అందుకోసం కరకట్ట కమల్‌హాసన్ అలియాస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైయస్ జగన్ తీవ్రంగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విషయంలో వైయస్ జగన్మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంప దెబ్బ లాంటిందని అభివర్ణించారు. నారా లోకేశ్‌పై ఓడిపోతామని గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పారిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి.. నేడు వైయస్ జగన్‌తో చేతులు కలిపి చంద్రబాబు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై పెట్టిన ఏ ఒక్క కేసు నిలబడలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా జవహర్ గుర్తు చేశారు. వైయస్ జగన్ అంటే జైలు.. 34 కేసులు.. ఈడీ కేసులకు బ్రాండ్ అని అభివర్ణించారు. ఆ బ్రాండ్‌ను చంద్రబాబుకు అంటించాలని వైయస్ జగన్ ప్రయత్నాలు చేసి చివరకు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇక విదేశాల్లోని తన కుమార్తెను చూడడానికి వెళ్లాలన్నా వైయస్ జగన్ కోర్టు అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాంటి నేర చరిత్ర ఉన్న వైయస్ జగన్.. నేరాలు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా వక్రబుద్ధి మార్చుకోవాలంటూ వైయస్ జగన్‌కు ఈ సందర్భంగా కె.ఎస్. జవహార్ హితవు పలికారు.ఓటుకు నోటు కేసులో నారా చంద్రబాబు నాయుడుని నిందితుడిగా చేర్చాలని.. అలాగే ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలంటూ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఆ యా పిటిషన్లను సుప్రీంకోర్టులోని జస్టిస్ సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ క్రమంలో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ పిటిషన్లు దాఖలు చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దంటూ పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ సందర్భంగా ధర్మాసనం మొట్టికాయలు వేసింది. అలాగే ఏపీ హైకోర్టు గతంలో ఇదే అంశంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఓటుకు నోటు కేసు అంశంలో చంద్రబాబును దోషిగా చూపించాలనే వైసీపీ నేతల ప్రయత్నాలకు ఈ విధంగా పుల్ స్టాప్ పడింది. అలాంటి వేళ.. టీడీపీ నేత కె.ఎస్. జవహర్ రెడ్డి పై విధంగా స్పందించారు.