సిగరెట్/ బీడీ తాగే కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. లైటర్‌తో వెలిగించి సిగరెట్‌కు అంటించుకొని మజా చేస్తుంటారు. చుట్టుపక్కల ఏం ఉంది..? మంటలు ఎగిసిపడే పెట్రో ఉత్పత్తులు ఉన్నాయా... లేవా అని ఆలోచన చేయరు. ఇంకొందరు పెట్రోల్ బంక్ సమీపంలో స్మోక్ చేసి, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంటారు. అనంతపురంలో ఓ వ్యక్తి ఇలానే చేశాడు. కళ్యాణదుర్గంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి షాపు ముందు ఉండి బీడీ తాగుతున్నాడు. బీడీ ఆరిపోవడంతో నిప్పు వెలిగించి బీడీ అంటించుకున్నాడు. అగ్గిపుల్లను రోడ్డు మీద పడవేశాడు. ఇంకేముంది మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. ఆ వెంటనే చుట్టు పక్కల వ్యాపించాయి. అక్కడున్న ఇద్దరు పరుగు తీయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. పక్కన ఉన్న వాహనాలకు కూడా నిప్పు అంటుకుంది. పెట్రోల్ బంక్ నుంచి ఓ వ్యక్తి ఐదు లీటర్ల ఫ్యూయల్ తీసుకొని బండి మీద వెళ్లాడు. ఆ క్యాన్ సరిగ్గా లేదు. రోడ్డు మీద పెట్రోల్ పడి పోయింది. ఆ విషయం బీడీ తాగే వ్యక్తి గమనించలేదు. అగ్గిపుల్ల పడేయడంతో మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న కొందరు మంటలను ఆర్పి వేసే ప్రయత్నించారు. అప్పటికే షాపు, వాహనాలకు నిప్పు అంటుకుంది. మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కొందరు నిర్లక్ష్యంగా బీడీ, సిగరెట్ తాగడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.