గత ఏడాది సాగర్ ఆయకట్టు కు సాగు నీరు విడుదల కాకపోవడం, వైసీపీ పాల కులు సాగర్ కాలువల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో పంట పొలాలకు నీరు చేరే పరిస్థితి లేకుం డా పోయింది. ప్రస్తుతం సాగర్ నీరు సాగుకు విడుదలైనా పొలాలకు చేరడం కష్టంగా మారింది. పూడికతీత పనుల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిధులు లేవని తెలిపారు. దీంతో రైతులు స్వచ్ఛందంగానే కాలువ పూడిక తీత పనులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వెంపరాల మేజర్, చినకొత్తపల్లి మైనర్ కాలువల పూడిక తీత పనులు బుధవారం నుంచి ప్రారంభించారు. ఆయకట్టులో వి.కొప్పెరపాడు, గోవాడ, చినకొత్తపల్లి, సాధునగర్ గ్రామాల రైతులు సుమారు 1.5 లక్షల రూపాయలను వసూలు చేసి రెండు ఎక్స్‌కవేటర్‌లతో పనులు చేస్తున్నారు. వెంపరాల మేజర్‌లో కొత్తూరు రోడ్డు నుంచి సుమారు 2కి.మీ. చినకొత్తపల్లి మైనర్‌లో సుమారు 4కి.మీ దూరం పూడికతీత పనులు చేస్తున్నారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలూ సాగర్ కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడంతో కాలువలు మరింత అధ్వానంగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కామినేని శ్యామలరావు, సోమేపల్లి రాము, నరిశెట్టి వీరాంజనేయులు, స్వాములు తదితరులు ఆయకట్టు రైతులను సమన్వయం చేసుకుంటూ పూడికతీత పనులు చేపడుతున్నారు.