సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన హారిక మరొక రోజు కాకినాడలోనే ఉండి ఉంటే మృత్యువు ఒడికి ఆమె చేరి ఉండేది కాదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ఎవరికైనా గుండెలు పిండేసే విధంగా ఉంటుంది. కడు పేదరికంలో పుట్టి చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందిన హారిక కు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో పెరిగింది. చక్కటి విద్యాభ్యాసంతో మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది. రాఖీ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది , మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది.