తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. సర్వదర్శనంతో పాటు రూ.300, బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీల సీఫార్సు లేఖలపై ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తారు. అయితే అక్టోబర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పది రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మత్సవాల సందర్భంగా తిరుమలలో అధిక రద్దీ ఉంటుంది. భక్తులు సాధారణ రోజులకంటే రెట్టింపు సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.