ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నం కేజీహెచ్ వెళ్లారు. ఈసందర్భంగా చిల్డ్రెన్ వార్డును పరిశీలించిన సీఎం...కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం అనాధాశ్రమంలో జరిగిన ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎంకు ట్రైనీ డాక్టర్లు వినతిపత్రం అందజేశారు. వైద్యుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎంను జూడాలు కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు కావాలని హెచ్చరించారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. కర్ణాటక మాదిరిగా కఠిన చట్టాలు తీసుకువస్తామని... ఇలాంటి ఘటనలు ఎవరూ ఉపేక్షించరని అన్నారు. ఇదే సమయంలో ఆందోళనలు చేస్తున్న ట్రైనీ డాక్టర్లు రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.