కుటుంబ వివాదాలతో వార్తల్లో నిలిచిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. టెక్కలి వైసీపీ ఇంఛార్జి స్థానం నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను టెక్కలి వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారంటూ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ఆందోళనకు దిగటంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత దివ్వెల మాధురి సైతం దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానంటూ విలేకర్ల సమావేశం పెట్టి ప్రకటించడం మరింత చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దువ్వాడ వాణి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో దువ్వాడ ఫ్యామిలీ డ్రామా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత దివ్వెల మాధురి ఆత్మహత్యకు యత్నించడం మరో ట్విస్ట్. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల ద్వారా రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలించలేదు. చివరకు తన భర్తతో కలిసి ఉంటానంటూ దువ్వాడ వాణి ప్రకటించినప్పటికీ.. దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం చర్చనీయాంశం కావటంతో వైసీపీ అధిష్టానం నష్టనివారణ చర్యలకు దిగింది.
పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మీద అచ్చెన్నాయుడు 34 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు నూతన ఇంఛార్జిగా నియమితులైన పేరాడ తిలక్ 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేశారు. అయితే పేరాడ తిలక్ మీద కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో పేరాడ తిలక్ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీచేసి.. అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంపై పట్టు ఉందనే కారణంతో వైఎస్ జగన్.. పేరాడ తిలక్‌కు మరోసారి పార్టీ బాధ్యతలు అప్పగించారు.