ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలుచేయాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ రుణానికి 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో 8 శాతం వడ్డీని కేంద్రం భరిస్తుండగా..మిగిలిన ఐదుశాతాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పీఎం విశ్వకర్మ యోజనకు ఆదరణ పథకాన్ని లింక్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆదరణ- విశ్వకర్మ యోజనగా దీనికి పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు పీఎం విశ్వకర్మ యోజన కింద పరికరాల కొనుగోలుకు 15 వేల రూపాయలు అందిస్తున్నారు. అలాగే ట్రైనింగ్ కోసం నాలుగు వేలు ఇస్తున్నారు. అయితే ఆదరణ- విశ్వకర్మ యోజన కింద.. ఈ మొత్తానికి తన వాటా కింద అదనంగా మరికొంత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. అలాగే ఈ పథకం కింద ఎంపిక చేసినవారికి వడ్డీ లేకుండా రూ.3 లక్షలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 13 శాతం వడ్డీలో 8 శాతం కేంద్రం, 5 శాతం లబ్ధిదారులు చెల్లిస్తుండగా.. లబ్ధిదారులు చెల్లించే ఐదుశాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే మూడు లక్షల రుణంలోనూ కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రకంగా మొత్తం రూ.3 లక్షల రుణాన్ని సున్నా వడ్డీకే అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు 2014-19 మధ్యన నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 16 లక్షల చేతివృత్తుల కుటుంబాలు ఉన్నాయి. అయితే వీరిలో ఎంతమంది ప్రస్తుతం చేతివృత్తుల మీద ఆధారపడి ఉన్నారనే దానిపై సర్వే చేయనున్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే తర్వాత ఆదరణ- విశ్వకర్మ యోజనను అమలు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం విశ్వకర్మ యోజన స్కీమ్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉంది. దీనిని కూడా బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.