అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలోకి దిగుతుండగా.. రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మొదట డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో ఉండగా.. ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో రేసులోకి కమలా హారిస్ వచ్చారు. ఇక బైడెన్ - ట్రంప్ మధ్య పోటీ ఉన్నపుడు ట్రంప్ ముందంజలో ఉండగా.. ప్రస్తుతం కమలా హారిస్ బరిలోకి దిగిన తర్వాత సర్వేలన్నీ ఆమె విజయం వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తన తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ హారిస్‌ను గుర్తు చేసుకున్నారు.
తన తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ హారిస్ 19ఏళ్ల వయసులోనే భారత్ నుంచి 7సముద్రాలు దాటి అమెరికాకు వచ్చారని కమలా హారిస్ తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు. "మన జీవిత కథలకు మనమే రచయితలుగా ఉండాలి" అని తన తల్లి ఎప్పుడూ చెప్పే మాటలే తనను ప్రస్తుతం ఈ స్థాయిలో నిలబెట్టాయని కమలా హారిస్ చెప్పారు. తన తల్లి జీవిత ప్రయాణం నుంచి తాను, తన సోదరి మాయ హారిస్ ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. ఈ డెమోక్రటిక్ పార్టీ నేషనల్ మీటింగ్‌లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరించిన కమలా హారిస్ తన తల్లి డా. శ్యామలా గోపాలన్ హారిస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు.
తాను జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. మహిళలకు ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్‌ను నయం చేసే సైంటిస్ట్ కావాలని తన తల్లి ఎన్నో కలలు కనేది అని కమలా హారిస్ వివరించారు. అదే లక్ష్యం, సంకల్పంతో ఆమె తన 19 ఏళ్ల వయసులో భారత్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చిందని.. చదువు పూర్తి అయిన తర్వాత తిరిగి భారత్‌కు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని.. జమైకాకు చెందిన తన తండ్రి డొనాల్డ్ హారిస్‌తో తన తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ హారిస్‌కు పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత అది ప్రేమగా మారినట్లు చెప్పారు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడినట్లు వివరించారు. తన జీవితం, భవిష్యత్తుపై తన తల్లి ఎప్పుడూ సొంతంగానే నిర్ణయాలు తీసుకునేదని.. తనను, తన చెల్లి మాయ హారిస్‌ను కూడా అలాగే తీర్చిదిద్దిందని కమలాహారిస్ గుర్తుచేసుకున్నారు.
ఇక ఏదైనా అన్యాయం జరిగితే దాని గురించి ఫిర్యాదు చేయడం మాత్రమే కాకుండా.. చేతనైతే అలా జరగకుండా మీవంతు కృషి చేయండి అంటూ తన తల్లి తమకు నేర్పిందని తెలిపారు. తన తల్లి బతికి ఉన్నపుడు.. అమెరికాలో ఉన్న తీవ్ర జాతి విద్వేషాన్ని ఎదుర్కొని.. భయపడకుండా నిలబడిందని గుర్తు చేసుకున్నారు. తాను తన తల్లిని ప్రతిరోజూ మిస్ అవుతూనే ఉంటానని.. మరీ ముఖ్యంగా ఇప్పుడు చాలా మిస్ అవుతున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన తనను.. తన తల్లి పైనుంచి చూస్తూ నవ్వుతూ ఉంటుందని భావిస్తున్నాని కమలా హారిస్ భావోద్వేగానికి లోనయ్యారు.
కమలా హారిస్ తల్లి భారతీయురాలు. తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్ 1958లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. 25 ఏళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్‌పై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ తర్వాత 1963లో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌ను పెళ్లి చేసుకోగా.. వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలు. కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులవడానికి ఏడాది ముందు ఆమె తల్లి 2009లో క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందారు.