తమ పని గంటలు ముగిసిన తర్వాత.. యజమానుల ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేకుండా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆగస్టు 26 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా పనిచేయమనే బాస్‌ల నుంచి మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. వాస్తవానికి ఈ చట్టాన్ని ఆస్ట్రేలియాలో గత ఫిబ్రవరిలోనే ఆమోదించినా.. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కొత్తచట్టానికి సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో పలు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పూర్తిగా తొందరపాటు చర్య అని.. లోపభూయిష్టంగా ఉందిన విమర్శలు గుప్పించారు.
అయితే, ఈ కొత్త చట్టంలో ఉద్యోగి హోదా, బాస్‌లతో మాట్లాడేందుకు తిరస్కరణలో సంస్థలు చెప్పే అసహేతుక కారణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి మినహాయింపులు ఇచ్చారు. కానీ, ఇటువంటి వెసులబాటు వల్ల చట్టం అమలు కష్టసాధ్యమని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఫెయిర్ వర్క్ చట్టం 2009లోని లోపాలను సరిదిద్దేందుకు ఈ సరికొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. దీంతో తక్కువ వేతన చెల్లింపులను నేరంగా పరిగణించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
ఈ చట్టం నిర్దిష్ట సమయం పూర్తయిన తర్వాత అదనంగా పనిచేసే ఉద్యోగికి పరిహారం లేదా అదనపు చెల్లింపులు ఇవ్వాలని, ఉద్యోగి పాత్ర స్వభావం, బాధ్యత స్థాయి, కుటుంబం లేదా సంరక్షణ బాధ్యతలు సహా వారి వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటితో పాటు యాజమాన్యాలు ఉద్యోగులను నియమించుకొనే చట్టాల్లో కూడా మార్పులు చేర్పులను చేయాలని భావిస్తున్నారు.
కాగా, ఇటువంటి చట్టాలు రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, అర్జెంటీనా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, స్లొవేకియా, స్పెయిన్, ఒంటారియో, ఐర్లాండ్ వంటి తదితర దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఉద్యోగులు తమ పని గంటల తర్వాత ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుని, వ్యక్తిగత జీవితం గడపేందుకు అవకాశం ఉంది. ఇక, యూకేలోనూ ఇటీవల అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వం రైట్ టూ డిస్‌కనెక్ట్ చట్టాన్ని అమలుచేయాలని యోచిస్తోంది.