దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. అనర్హులైన సిబ్బందితో విమానాలు నడుపుతున్నందుకు ఎయిరి ఇండియాకు రూ.90 లక్షలు భారీ జరిమానా విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్‌కు రూ.6 లక్షలు, డైరెక్టర్ శిక్షణకు రూ.36 లక్షల చొప్పున జరిమానా విధించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తంగా రూ.98 లక్షల జరిమానా వేసింది. భవిష్యుత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు హెచ్చరికగా జరిమానా విధించామని డీజీసీఏ పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత సంస్థను హెచ్చరించామని తెలిపింది.
‘నాన్-లైన్-రిలీజ్డ్ ఫస్ట్ ఆఫీసర్‌తో కలిసి నాన్-ట్రైనర్ లైన్ కెప్టెన్ నేతృత్వంలో ఎయిరిండియా విమానాన్ని నడిపింది.. దీనిని భద్రతాపరంగా తీవ్రమైన షెడ్యూల్ సంఘటనగా పరిగణిస్తున్నాం.. జులై 10 ఎయిర్‌లైన్ సమర్పించిన వాలంటరీ నివేదిక ద్వారా ఈ అంశం మా దృష్టికి వచ్చింది.. దీంతో డాక్యుమెంటేషన్ పరిశీలన, షెడ్యూలింగ్ సౌకర్యం స్పాట్ చెక్‌తో సహా ఆ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాం.. పలు లోపాలు, భద్రత ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఈ ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.. ’ అని డీజీసీఏ స్పష్టం చేసింది.
జులై 22న జారీ చేసిన షోకాజ్ నోటీసుల ద్వారా విమాన కమాండర్, ఎయిర్‌లైన్ పోస్ట్ హోల్డర్‌లు తమ స్థితిని వివరించడానికి అవకాశం కల్పించినట్లు DGCA తెలిపింది. ‘సంబంధిత సంస్థలు సమర్పించిన నివేదిక సంతృప్తికరంగా లేదు.. ప్రస్తుతం ఉన్న నిబంధనల పరంగా చర్యలు తీసుకుంటున్నాం.. ఎయిరిండియాకు రూ.90 లక్షలు, విమానయా సంస్థ ఆపరేషన్ విభాగం డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, శిక్షణ విభాగం డైరెక్టర్2కు రూ.3 లక్షలు జరిమానా విధించాం’ అని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
గతంలోనూ ఎయిరిండియాకు ఇటువంటి జరిమానా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో నిబంధనలను అతిక్రమించినందుకు రూ.80 లక్షలు ఫైన్ వేసింది. విశ్రాంతిని కల్పించకుండా నిరంతరం పైలట్లకు డ్యూటీలు వేస్తూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినందుకు ఈ జరిమానా వేసింది. ఎయిరిండియాలో ఆడిట్ నిర్వహించిన డీజీసీఏ.. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు 60 ఏళ్లకు మించి వయసున్న వారు ఉన్నారని గుర్తించింది. అంతేకాదు పైలట్ల డ్యూటీ, ట్రిప్‌ల తర్వాత, ముందు విశ్రాంతి ఇచ్చే విషయంల్లో నియమ నిబంధనలు పాటించడం లేదని తేలింది.