వివాదాస్పద వక్ఫ్ బోర్డు చట్టంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఈ కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది. అయితే, ఈ బిల్లుపై విపక్షాలే కాదు ఎన్డీయేలోని మిత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, లోక్‌జన శక్తి పార్టీలు ఇప్పటికే ప్రశ్నించాయి. తాజాగా, జేడీయూ కూడా ఆ జాబితాలో చేరింది. ముస్లింల ప్రయోజనాలకు కాపాడేందుకు ప్రతిపాదిత చట్టంలో సవరణలు చేయాలని జేడీయూ కోరుతోంది. లోక్‌సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అనుకూలంగా మాట్లాడారు.
అయితే, దీనిపై జేడీయూలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలిసిన బిహార్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ జమా ఖాన్.. తీవ్ర నిరసన తెలిపారు. ఆయనతో పాటు నితీశ్‌కు అత్యంత సన్నిహితుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌధురి సైతం ముస్లిం సమాజం ఆందోళన గురించి ప్రస్తావించారు. బిహార్‌లో 18 శాతం ముస్లిం మైనార్టీలు ఉండగా.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొక తప్పదని భావిస్తోన్న జేడీయూ.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, మంత్రి జమా ఖాన్‌లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు.
కానీ, కేంద్రం మాత్రం సవరణలను సమర్దించుకుంటోంది. ఇది వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకతతో ముస్లిం మహిళలు, మేధావుల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేస్తుందని చెబుతోంది. అయితే, ఎన్డీయేలోని మిత్రపక్షం టీడీపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జేపీసీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీ, ఇతర వర్గాల అభిప్రాయాలను తీసుకుని 31 మంది సభ్యుల జేపీసీ ముందు ఉంచుతామని తెలిపారు. ‘మేము అన్ని అభిప్రాయాలను వింటాం.. ముందుగా వాటిని పార్టీ ముందు పెట్టి.. ఆ తర్వాత జేపీసీలో లేవనెత్తుతాం.. బిల్లులో అందరూ ఒకే పేజీలో ఉండాలి’ అని అన్నారు.
ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ ప్రతిపాదనలను సమాఖ్య వ్యవస్థపై దాడిగా, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా విమర్శిస్తున్నాయి. కానీ, దీనిపై అధికార ఎన్డీయే ఎదురుదాడికి దిగుతోంది. సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ‘మీకు చేతకాలేదు కాబట్టి.. మేం చేయాల్సి వచ్చింది.. కొంతమంది వక్ఫ్ బోర్డులను కబ్జా చేశారు.. సాధారణ ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం’ అని ఆయన ప్రకటించారు.