విజయవాడ నగరపాలక సంస్థలో వైకాపా కార్పొరేటర్ల సంఖ్యా బలం రోజు రోజుకూ తగ్గిపోతోంది.గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా తరఫున 49 మంది గెలవగా, తెదేపా నుంచి గెలిచిన మరొకరు కూడా చేరిపోవడంతో సంఖ్యా బలం 50కు చేరింది. గత ఐదేళ్లు తాము అధికారంలో ఉన్నా.. నగరానికి పెద్దగా చేసిందేమీ లేదని.. వైకాపా కార్పొరేటర్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి బయటకొస్తున్నారు. ఇప్పటికే తెదేపా నుంచి గతంలో వైకాపాకు వెళ్లిన కార్పొరేటర్‌తో పాటూ మరో ఇద్దరు బయటకొచ్చేశారు. వీరు ముగ్గురు తెదేపాలో చేరారు. మిగిలిన వారినైనా కాపాడుకోవాలని వైకాపా అధిష్ఠానం సూచన మేరకు.. మేయర్ భాగ్యలక్ష్మితోపాటు... మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే విజయవాడలోని ఓ హోటల్‌లో మేయర్ ఆధ్వర్యంలో వైకాపా కార్పొరేటర్లతో శనివారం రహస్య భేటీ నిర్వహించగా.. ఏకంగా 11 మంది డుమ్మా కొట్టారు.ఈనెల 28న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసేందుకే ఈ భేటీ నిర్వహించినట్లు వైకాపా నేతలు బయటకు చెబుతున్నారు. కానీ.. ఉన్న వారు జారిపోకుండా కాపాడుకోవడమే అసలు ఎజెండా అని ఆ పార్టీ కార్పొరేటర్లే పేర్కొనడం గమనార్హం. వైకాపాలో ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు ఉండగా.. వారిలో 36 మంది మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. మిగతా 11మంది రకరకాల కారణాలను సాకుగా చూపుతూ.. సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరిలో నలుగురు ఇప్పటికే పార్టీ మారుతున్న సంకేతాలు ఇచ్చారు. ముగ్గురు జనసేన, ఒకరు భాజపా గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరిని సైతం కలిశారు. ఈ నలుగురు, ఇప్పటికే తెదేపాలో చేరిన ముగ్గురితో కలిపి.. ఏడుగురూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వారే కావడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌తో పొసగకే వీళ్లంతా పార్టీని వీడుతున్నట్టు చెబుతున్నారు. తాజా రహస్య సమావేశానికి పదకొండు మంది కార్పొరేటర్లు గైర్హాజరవడం చూస్తే.. ఆ నలుగురు కాకుండా మరో ఏడుగురు కూడా రేపోమాపో వైకాపాను వీడే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.