అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధప్రదేశ్‌కు చెందిన ప్రవాసీ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు (64) శుక్రవారం సాయంత్రం దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయినట్టు సన్నిహితులు వెల్లడించారు. అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించిన రమేశ్ బాబు... అలబామా రాష్ట్రంలోని టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వైద్య సేవలకు గుర్తింపుగా అక్కడి ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు ఆయన తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చేవారు.
డాక్టర్ రమేశ్ బాబు తండ్రి చినగురునాథం సాధారణ రైతు. వారి ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దవాడైన రమేశ్‌బాబు.. పదో తరగతి వరకూ సొంతూరులోనే చదువుకున్నారు. నాయుడుపేటలో ఇంటర్.. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. అనంతరం జమైకాలో ఎమ్మెస్ పూర్తిచేసి, అమెరికాకు వెళ్లి వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే కాగా.. వీరిని నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా.. వారంతా అమెరికాలోనే ఉంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో రమేశ్‌బాబు చేసిన విశేష సేవలకు అనేక పురస్కారాలు వరించాయి. ఇక, స్వగ్రామంలో తాను చదువుకున్న పాఠశాల కోసం రూ.14 లక్షల విరాళంగా ఇచ్చారు. అలాగే, గ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు అందజేసి మంచి మనసు చాటుకున్నారు. ఆగస్టు 15న నాయుడుపేటలో తమ బంధువుల ఇంట జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. ఇక్కడ నుంచి వెళ్లిన కొద్ది రోజులకే ఆయన మృతి చెందడం బాధాకరం.
ఆయన మరణ వార్త కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబం శోకసంద్రంలో మునిపిగిపోయింది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న రమేశ్ బాబు తల్లి, తమ్ముడు.. నాయుడుపేటలో ఉన్న సోదరి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల అమెరికాలోని భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు.