కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో నీటి కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఉన్న నీరు మరో 130 రోజులకు మాత్రమే సరిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై నీటి కొరత గురించి టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు.తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో నీటి కొరత అంశంపై శనివారం టీటీడీ ఈవో విలేకర్లతో మాట్లాడారు. నీటి కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శనివారం నాటికి తిరుమలలో కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్‌లలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ ఈవో వివరించారు.
అలాగే తిరుపతి పట్టణంతో పాటుగా తిరుమల నీటి అవసరాలకు ఉపయోగపడే కళ్యాణి డ్యామ్‌లోనూ 5,608 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉందని శ్యామలరావు తెలిపారు. ఈ నీటిని ఒక క్రమ పద్ధతిలో వాడుకుంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు నీటి అవసరాలతో సహా 130 రోజుల వరకు సరిపోతుందని వెల్లడించారు. మరోవైపు తిరుపతి మున్సిపల్ కమిషనర్, సోమశిల ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్‌తోనూ నీటి సరఫరాపై చర్చించామన్న టీటీడీ ఈవో.. కళ్యాణి డ్యామ్ నుంచి 11 లక్షల గ్యాలన్ల నీటిని అదనంగా సరఫరా చేయడానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ అంగీకరించినట్లు చెప్పారు. దీంతో మరో నెలరోజులు అదనంగా నీటి అవసరాలు తీరతాయని చెప్పారు.
ఇక కైలాసగిరి రిజర్వాయర్ నుంచి కూడా మరో 10 ఎంఎల్‌డీల నీరు తిరుపతికి సరఫరా చేస్తారన్న టీటీడీ ఈవో.. తిరుపతికి నీటి సరఫరా కోసం పైప్‌లైన్ వేసేందుకు రూ.40 కోట్లను టీటీడీ మంజూరు చేసినట్లు చెప్పారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటి విడతగా రూ. 5.62 కోట్లను విడుదల చేశామన్న శ్యామలరావు.. అదనపు పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ పైప్‌లైన్ పూర్తి అయితే తిరుపతి నుంచి తెలుగు గంగ నీటిని తిరుమలకు సరఫరా చేసేందుకు వీలవుతుందని వివరించారు. మరోవైపు నీటి కొరత కారణంగా తిరుమలలోని బాలాజీనగర్‌కు ఇకపై ఆరు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.