వైయస్.జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోనసీమ జిల్లా వానపల్లి గ్రామపర్యటన కొనసాగిందే తప్ప.. గ్రామ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలేవీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తన మాటలతో మరొక్కసారి చంద్రబాబు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్న జగ్గిరెడ్డి.. గ్రామసభలు గతంలోనూ జరిగాయని.. ఇవాల వాటిని తాను కొత్తగా కనిపెట్టునట్టు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రావులపాలెం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు మేలు చేసే ఒక్క ప్రకటన గ్రామసభలో లేకపోవడం నియోజకవర్గ ప్రజలను నిరాశపర్చిందని తేల్చి చెప్పారు. చంద్రబాబు తన మాటల గారడీతో ప్రజలను మోసం చేశారన్న జగ్గిరెడ్డి… వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరగలేదన్న బాబు మాటలను ఖండించారు.వానపల్లి గ్రామంలో అమ్మఒడి కార్యక్రమం ద్వారా రూ.5 కోట్లు తల్లులకు అందించి సాయం చేసినందుకా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిందిస్తున్నారని నిలదీశారు. అదే గ్రామంలో రైతుభరోసా ద్వారా రూ.5.30 కోట్లు, ఆసరా ద్వారా రూ.6.30 కోట్లు అందించామన్నారు. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.42 కోట్లు అందించామన్నారు. చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేసిన ఫలాలమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన రూ. 1.6 కోట్లు నిధులతోనే.. ఆలయ ప్రాకార మండపం నిర్మించామని జగ్గిరెడ్డి స్పష్టం చేసారు.