ఎన్నికల వేళ ఓట్ల వేటకు ప్రధాని మోడీ తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివిధ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వరాల జల్లు కురిపించారు. ఏకంగా 30 కోట్ల ఓట్లను కొల్లగొట్టేలా రూపొందించిన మూడు పథకాలు ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి వీస్తుందన్న సర్వేలా ఫలితాలతో మేల్కొన్న మోడీ సర్కారు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులు, వేతనజీవులు, శ్రమజీవుల మనసు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు వర్గాల్లో ఉన్న 30 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా పథకాలు తీసుకువచ్చింది. ఇప్పుడు వారి, వారి కుటుంబాల ఓట్లు తమకేనని బీజేపీ ఆశపడుతోంది. వాస్తవానికి ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పినప్పటికీ...పూర్తి స్థాయి బడ్జెట్‌గా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా పథకాలు ప్రవేశపెట్టి మోడీ సర్కారు సరికొత్త సంప్రదాయానిక తెరలేపింది. కొత్త పథకాలకు కేటాయింపులు లేకున్నప్పటికీ మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తిస్థాయి కేటాయింపులు జరుపుతామన్న ధీమా కల్పించింది.
దేశవ్యాప్తంగా మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో కమలం పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీ, తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదని సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీ పొత్తు కారణంగా ఆ కూటమి ఎక్కువ స్థానాలు గెలచుకుంటుదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజాకర్షక పథకాలే శ్రీరామరక్ష అని భావించిన మోడీ సర్కారు అటువైపు మొగ్గుచూపింది. ఏకంగా 30కోట్ల మందికి లబ్ధి చేకూరేలా ఒకేసారి మూడు వరాలను ఇన్‌ఛార్జి ఆర్థికమంత్రి పీయుష్‌గోయల్ ప్రకటించారు. ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు, ప్రణబ్‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడం ద్వారా బెంగాల్, యూపీ ప్రజల మనసు దోచుకున్నామని మోడీ సర్కారు భావిస్తోంది. తాజా బడ్జెట్‌తో ఆ పరిధిని మరింత విస్తృతం చేయగలిగింది.
12 కోట్ల మంది రైతులు-తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకానికి మార్పులు చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో బాగంగా అయిదు ఎకరాలలోపు ఉన్న రైతులకు ఏటా రూ.6వేల చొప్పున అందించనుంది. ఇది గతేడాది డిసెంబరు నుంచి అమలలోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ సాయం కూడా నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున విడతల వారీగా అందించనుంది. ప్రస్తుతం ప్రవేశపెట్టని బడ్జెట్ ఈ సమావేశాల్లో ఆమోదం పొందితే వెంటనే రైతుల ఖాతాల్లో మార్చి నెలాఖరులోగా రూ.2వేలు పడనున్నాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12కోట్ల చిన్నసన్నకారు రైతులు లబ్ధిపొందుతారని కేంద్రం భావిస్తోంది. ఆయా రైతు కుటుంబాల ఓట్లు తమకే పడతాయన్న ధీమా బీజేపీ వ్యక్తం చేస్తోంది.
3కోట్ల మంది ఉద్యోగులకు లాభం-దేశంలో వేతన జీవులు కేంద్ర బడ్జెట్ వస్తోందంటే టాక్సు స్లాబ్ మారుస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తారు. గత నాలుగేళ్లుగా టాక్సు స్లాబులు కేంద్రం మార్చడం లేదు. ఇప్పుడు ఏకంగా 2.50లక్షల ఆదాయం నుంచి 5లక్షలకు స్లాబును కేంద్రం పెంచింది. ఏటా రూ.5లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులు ఇక ట్యాక్సు చెల్లించనక్కర్లేదు. ఆపైన ఉంటేనే చెల్లించాలి. దీనివల్ల వేతన జీవులు పెద్ద ఎత్తున ఊరట చెందుతారు. ట్యాక్సు స్లాబ్ మార్చడం కారణంగా ప్రభుత్వంపై సుమారు 18వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే సమయంలో దీనివల్ల 3కోట్ల మంది ఉద్యోగులు లబ్ధి పొందారు. అంటే ఆ మేరకు తమకు ఓట్లు కలిసి వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది.
15 కోట్ల మంది కార్మికులు -అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల బతుకులు ఈ దేశంలో ఎంతో దుర్భరం. పనులు దొరక్క వారు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇలాంటి వారు 60ఏళ్లు దాటాక వృద్ధాప్యం మీద పడి ఏ పని చేయలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఏవైనా చిన్న పనులు చేసినా చాలీచాలని కూలీనే వస్తోంది. కడుపు నింపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దేశంలో 40 కోట్ల మంది అసంఘిత రంగంలో కార్మికులుగా ఉన్నారని ప్రభుత్వ అంచనా. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకాన్ని వీరి కోసం తీసుకువచ్చింది. నెలకు రూ.15వేలలోపు ఆదాయం ఉన్న వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం కడితే 60ఏళ్లు నిండిన తర్వాత ఏటా రూ.3వేల పింఛను లభిస్తుంది. ఈ ప్రీమియం పోస్టీఫీసుల ద్వారా కట్టించుకునే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా 15 కోట్ల మంది లబ్ధి పొందుతారని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa