కడపలో చెత్తపై రాజకీయం వేడెక్కింది. ఈ వ్యవహారం కాస్త ఎమ్మెల్సే వర్సెస్ మేయర్‌గా మారిపోయింది. వాహనాల ద్వారా ఇంటింటి వద్ద చెత్త సేకరణ చేయకపోతే.. మేయర్ ఇంట్లో చెత్త వేస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరించేంత దూరం ఈ వ్యవహారం వెళ్లింది. అసలు విషయంలోకి వస్తే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మాధవిరెడ్డి గెలుపొందారు. అయితే కడప నగరపాలక సంస్థ మాత్రం వైసీపీ చేతిలో ఉంది. కడప మేయర్‌గా వైసీపీ నేత సురేష్ బాబు ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే చెత్త సేకరణపై పన్ను వేయమని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్ను వసూలు చేయవద్దని నిర్ణయించారు.
అయితే ఈ చెత్త పన్ను అంశమే ఇప్పుడు కడపలో మేయర్ వర్సె్స్ ఎమ్మెల్యేగా మారింది. నగరపాలక సంస్థ పరిధిలో చెత్త పన్ను వసూలు చేయాలని మేయర్ ఆదేశించారు. అయితే చెత్త పన్ను వసూలు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించినందున వసూలు చేయకూడదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశిస్తున్నారు. చెత్త పన్ను వసూలు చేయాలని మేయర్.. చేస్తే ఊరుకోమంటూ ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు చెత్త పన్ను వసూలు చేయకూడదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే పన్ను వసూలు వద్దని మౌఖికంగా మాత్రమే చెప్పారు కానీ.. అధికారిక ఉత్తర్వులు లేవని మేయర్ వాదన. తాజాగా చెత్త సేకరణను కార్పొరేషన్ మేయర్ నిలిపి వేయించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. చెత్త సేకరించే వాహనాలను సైతం దశల వారీగా కార్పొరేషన్ తొలగిస్తోందని విమర్శించారు. వాహనాల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరించకపోతే కడప మేయర్ ఇంట్లో చెత్తవేస్తానని హెచ్చరించారు.
అయితే చెత్త సేకరణపై కడప మేయర్ సురేష్ బాబు వాదన మరోలా ఉంది. కడపను పరిశుభ్రంగా ఉంచాలనేదే తమ ఉద్దేశమన్న మేయర్.. ఇందుకోసం చెత్త సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇక చెత్త సేకరణ కోసం వంద వాహనాలు, రెండు వందల మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. 20 వాహనాలను మాత్రమే తొలగించినట్లు చెప్పారు. ఇక చెత్త పన్ను వసూలు లేకపోతే వీరికి జీతాలు ఎలా చెల్లించాలని మేయర్ ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల నుంచి కడపలో చెత్త పన్ను ఇవ్వడం లేదని.. సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. దీనికి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేక కార్పొరేషన్ భరించాలా అనేది ప్రభుత్వం స్పష్టం చేయలేదన్నారు. అయితే ఇంటింటి నుంచి చెత్త సేకరణకు నిధులను కార్పొరేషన్ భరించాలని జీవోలో ఉందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్తున్నారు. దీంతో కడపలో చెత్త కారణంగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం మారిపోయింది.