అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారని.. ఈ ముగ్గురి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఎసెన్షియా కంపెనీలో పేలుడు సంభవించి 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేసింది. అదే విధంగా పరవాడ సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారికి కూడా కోటి అందిస్తామని మంత్రి అనిత తెలిపారు.
కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన హోం మంత్రి అనిత.. రెండు దుర్ఘటనల్లోనూ బాధితులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని గుర్తుచేశారు. అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం జరిగితే సీఎం చంద్రబాబు వేగంగా స్పందించారని.. గంటల్లోనే బాధితులను పరామర్శించారని అనిత గుర్తుచేశారు. అలాగే హోం మంత్రిగా తాను ఘటనాస్థలిలోనే ఉంటూ పనులను పర్యవేక్షించినట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే కార్మికులను అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ చేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు పరవాడ సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయనగరానికి చెందిన సూర్యనారాయణ అనే కెమిస్ట్ కన్నుమూశాడు. వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న బాధితుడు.. సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు. ఆగస్ట్ 22వ తేదీ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ పరిశ్రమలోని మూడో యూనిట్‌లో ప్రమాదం జరిగింది. రసాయనాలు కలుపుతున్న సమయంలో ప్రమాదం జరగ్గా.. నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఈ నలుగురిలో ఝార్ఖండ్‌కు చెందిన లాల్ సింగ్ 23వ తేదీ.. రొయా అంగిరియా 24న కన్నుుమాశారు. సోమవారం సూర్యనారాయణ చనిపోయాడు. ఇక ఝార్ఖండ్‌కు చెందిన ఓయబోం కొర్హ అనే వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.