మహారాష్ట్రలో ఓ హెలికాప్టర్ శనివారం రోజు కూలిపోయిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణెలోని పౌద్ సమీపంలో కూలింది. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఏపీకి లింక్ పెడుతూ ప్రచారం జరిగింది. ఈ హెలికాప్టర్ ముంబై నుంచి విజయవాడ వస్తుండగా క్రాష్ అయ్యిందని.. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని కొందరు సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేశారు. ఈ హెలికాప్టర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
ఈ హెలికాప్టర్ నెల రోజుల నుంచి మెయింటెన్స్‌లో ఉందని.. ఇప్పుడు ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే ప్రయత్నం చేశారని కొందరు ప్రచారం చేశారు. ఏపీలో ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్లు కొందరు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్‌ను రప్పించే యత్నాలు చేసినట్లుగా ఆరోపించారు. అయితే చంద్రబాబు కోసం ఈ హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారనే ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఈ మేరకు కొందరు తెలుగు తమ్ముళ్లు మహారాష్ట్ర పోలీస్ అధికారి ఈ హెలికాప్టర్ ప్రమాదంపై మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దు అంటున్నారు.
ఈ ప్రమాదానికి ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు అధికారులు. గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ ప్రైవేట్ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న పైలట్ సహా నలుగురు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయని.. మిగిలినవారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్ పుణెకు 35 కిలోమీటర్ల దూరంలోని పౌద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంధ్వాలే దగ్గర కూలింది. ఉన్నట్టుండి భారీ వర్షాల కారణంగా ఇబ్బందితో హెలికాప్టర్ కూలిపోయిందన్నారు పోలీసులు.
ఈ హెలికాప్టరు ముంబై నుంచి బయలుదేరిన సమయంలో వాతావరణం బాగానే ఉందని.. మధ్యలో పుణె సమీపంలోని పౌద్ ప్రాంతానికి వచ్చేసరికి వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ను దింపేందుకు పైలట్ ప్రయత్నించగా.. తుమ్మ చెట్టును ఢీకొట్టి కూలిపోయిందన్నారు. కాకపోతే ఆ చెట్టు ఉండటంవల్ల ప్రమాద స్థాయి తగ్గిందని.. హెలికాప్టర్‌లో ఎటువంటి సాంకేతిక లోపం లేదని క్లారిటీ ఇచ్చారు. హెలికాప్టర్‌లో పైలట్ ఆనంద్, ప్రయాణికులు వీర్ భాటియా, అమర్ దీప్ సింగ్, ఎస్‌పీ రాం ఉన్నట్లు వివరాలతో సహా పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ వీడియోను కొందరు తెలుగు తమ్ముళ్లు ట్వీట్ చేశారు.