నితిన్ గడ్కరీ ఒక విచిత్ర రాజకీయవేత్త. ఆయన ఆహారప్రియుడు; సొగసైన అధునాతన వస్త్రాలను ధరిస్తారు; జీవితాన్ని నిండుగా ఆస్వాదించే వ్యక్తిలా కన్పిస్తారు. తనను గురించిన ఈ విషయాలను గడ్కరీనే స్వయంగా అంగీకరించారు. బహిరంగ సభలు, సమావేశాలలో ప్రసంగించడం ఆయనకు బహు పసందైన విషయం. ఎటువంటి చింతలేని, ఎవరినీ లక్ష్య పెట్టని వ్యక్తిలా ఆయన ప్రసంగం సాగిపోతుంది సుమా! అదే సమయంలో గడ్కరీ ఒక స్వయం సేవకుడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలు అభిమానించే రాజకీయ వేత్తలలో ఆయన ఒకరని ప్రతీతి.
గడ్కరీ తన నియోజకవర్గం నాగపూర్ (మహారాష్ట్ర) బాగోగులను చక్కగా చూసుకుంటారు. ఆరెస్సెస్ ప్రముఖులు, ప్రచారకులు; తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎవరికి ఏ పని అవసరమైనా చేసి పెడతారు. వారు సదా సంతృప్తిగా, అనుకూల వైఖరితో ఉండేలా చేస్తారు. నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ ఇరువురూ నాగపూర్ కు చెందినవారే. ఇరువురి రాజకీయ జీవితానికి అదే ప్రాంతం నుంచే మద్దతు లభిస్తుంది. ఇరువురికీ మద్దతునిచ్చే నాయకులు, కార్యకర్తలు ఒకే రాజకీయ, సైద్ధాంతిక కుదురుకు చెందిన వారే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని గడ్కరీ ప్రగాఢంగా ఆకాంక్షించారని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశలను భగ్నం చేశారని మహారాష్ట్రలో ప్రజలు చెప్పుకుంటారు. విధేయుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆ ప్రతిష్ఠాత్మక ముఖ్యమంత్రి పదవికి మోదీ ఎంపిక చేశారు. అత్యున్నత అధికార ప్రాభవాన్ని సాధించుకోవాలనే గడ్కరీ ఆకాంక్షల ను, ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా, మోదీ చాలా తెలివిగా అడ్డుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.అయితే గడ్కరీ సామాన్యుడా? తన పురోగతికి ప్రధాన మంత్రి నుంచి ఎదురవుతున్న అవరోధాలను గమనించి ఆయన తన పురోగమనానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారు.
2014లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని 145 లోక్‌సభ నియోజకవర్గాలలో 135 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకున్నది. 2019లో ఈ 135లో కనీసం 80 స్థానాలను అధికార పార్టీ కోల్పోవడం ఖాయమని పలువురి అంచనా. సరిగ్గా ఇటువంటి ఫలితాన్నే నితిన్ గడ్కరీ, ఆయన మద్దతుదారులు హృదయ పూర్వకంగా ఆశిస్తున్నారు! ఒక సదస్సులో ఆయన ఇలా అన్నారు: ‘అచ్ఛే దిన్ విషయమై మీడియా గతంలో మమ్ములను చిక్కుల్లో పెట్టింది. దయచేసి నా మాటలకు వక్ర భాష్యం చెప్పకండి. అచ్ఛే దిన్ అనేది లేదు… ఆ శుభ కామన ఒక విశ్వాసం మాత్రమే, మీరు విశ్వసిస్తే అచ్ఛే దిన్ ఉన్నట్టే’ అని చేసిన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినవే ! ఇటీవల ఆచితూచిన మాటలతో చేస్తున్న ప్రకటనలతో గడ్కరీ రాజకీయ సీమలలో చిన్న తుఫానులే సృష్టించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa