సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. రాజకీయాల్లోనూ అదే రకమైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. తనదైన శైలిలో దూసుకెళ్తున్న కంగనా రనౌత్.. తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రైతులు చేస్తున్న నిరసనలను.. బంగ్లాదేశ్ అల్లర్లతో పోల్చుతూ కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో బీజేపీ స్పందించింది. పార్టీ పాలసీలపై మాట్లాడే అధికారం, అనుమతి కంగనా రనౌత్‌కు లేదని స్పష్టం చేసింది.
దేశంలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఉద్యమంపై ఇప్పటికే పలుమార్లు కంగనా రనౌత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. అప్పుడే ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే తాజాగా ఆమె మరోసారి రైతుల ఆందోళనలపై చేసిన వ్యాఖ్యలు.. రైతు సంఘాలు, ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్నదాతలు చేపట్టిన నిరసనలను కట్టడి చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ట్విటర్‌లో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే వీడియో తీవ్ర దుమారానికి కారణం అయింది.
అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని.. ఆ పోరాటంలో లైంగిక దాడులు కూడా చోటు చేసుకున్నాయని కంగనా రనౌత్ ఆ వీడియోలో ఆరోపించారు. అంతేకాకుండా సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నా.. దేశంలో రైతుల పేరుతో నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వా్ర్థ ప్రయోజనాలు ఆశించే వారు కొందరు వారిని ప్రోత్సహించారని ఆమె దుయ్యబట్టారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో భారత్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉందని.. ఇందుకు విదేశీ శక్తులు కుట్రలు చేశాయని కంగనా రనౌత్ ఆరోపించారు. దేశం కుక్కల పాలైనా వారికేం పట్టదని తీవ్ర విమర్శలు చేశారు.
ఇక కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పంజాబ్ బీజేపీ సీనియర్ నేత హర్జిత్ గరేవాల్.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రైతుల గురించి మాట్లాడే వ్యవహారం కంగనా రనౌత్ పని కాదని.. దాన్ని ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ.. రైతులకు అనుకూలమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని.. ఇదే సమయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సున్నితమైన, మతపరమైన అంశాలపై కంగనా రనౌత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు.
ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కంగనా రనౌత్.. రైతుల ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని కమలం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో పార్టీ విధానాలు, పాలసీలు, నిర్ణయాలపై మాట్లాడే అర్హత, అనుమతి, అధికారం కంగనా రనౌత్‌కు లేవని బీజేపీ అధిష్ఠానం తేల్చి చెప్పింది.