కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌కు సంబంధించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో కొత్తగా మరో 5 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. సోమవారం వెల్లడించారు. ఇప్పటివరకు లడఖ్‌లో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఉండగా.. తాజాగా 5 జిల్లాలు ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 7కు పెరగనుంది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల పేర్లను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలను.. లడఖ్‌లోని ప్రతీ ఇంటికి అందజేయాలనేదే మోదీ సర్కార్ లక్ష్యమని అమిత్ షా వివరించారు. మరోవైపు.. లడఖ్‌లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
లద్దాఖ్ విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అక్కడ కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ట్విటర్ వేదికగా ప్రకటించారు. అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన లడఖ్‌ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగానే ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించిందని అమిత్ షా తెలిపారు.
ఈ క్రమంలోనే ఆ కొత్త జిల్లాల పేర్లను కూడా ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు జన్‌స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్ అనే పేర్లు పెట్టినట్లు వివరించారు. ఈ 5 కొత్త జిల్లాలతో ప్రభుత్వ పాలన మరింత పటిష్ఠం అవుతుందని అమిత్ షా చెప్పారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని.. లడఖ్ ప్రజలకు అవకాశాలను సమృద్ధిగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు.
లడఖ్‌లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. లడఖ్ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఒక ముందడుగు అని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అవకాశాలు, సేవలు మరింత చేరువ అవుతాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లడఖ్ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి.. జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అందులో జమ్మూ కాశ్మీర్ ఒకటి కాగా.. లడఖ్ మరొకటి. అయితే శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాలనా నియంత్రణలో ఉంది. ఇప్పటివరకు లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు మాత్రమే ఉండగా.. తాజా నిర్ణయంతో వాటి సంఖ్య 7కు పెరగనుంది.
1979లో లడఖ్‌ను కార్గిల్, లేహ్ అనే రెండు జిల్లాలుగా విభజించారు. ఆ తర్వాత లడఖ్‌లో 1989లో బౌద్ధులు, ముస్లింలకు మధ్య అల్లర్లు జరిగాయి. దీంతో 1990లలోనే లడఖ్‌ను కాశ్మీరీ పాలన నుంచి విముక్తి చేయడానికి లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 2019 ఆగస్టు5వ తేదీన లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఇక మన దేశంలో అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ లడఖ్ ఒకటి. ఇక భారత్‌కు పొరుగు దేశాలైన చైనా, పాక్ సరిహద్దుల్లో ఉన్న ఈ లడఖ్ ప్రాంతం వ్యూహాత్మకంగా, దేశ రక్షణ పరంగా చాలా ముఖ్యమైంది. లడఖ్‌కు తూర్పున టిబెట్.. దక్షిణాన లాహౌల్, స్పితి.. పశ్చిమాన జమ్మూ కాశ్మీర్, బాల్టిస్తాన్.. ఉత్తరాన జిన్‌జియాంగ్‌లోని ట్రాన్స్ కున్లున్ ప్రాంతం సరిహద్దులుగా ఉన్నాయి.