బెంగాల్ మమత సర్కార్ మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సోమవారం ఆమె లేఖ రాశారు. బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను కేటాయించినప్పటికీ.. వీటిలో చాలా వరకు ప్రారంభించలేదని ఆక్షేపించారు. మహిళలు, బాలికలకు భద్రతా చర్యలు అమలు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఇంకా 11 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఉమెన్ హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, చైల్డ్ హెల్ప్‌లైన్‌లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరమన్నారు.
కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదన్నారు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను ఎదుర్కొనేందుకే కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితను దేశవ్యాప్తంగా 2024 జులైలో నుంచి అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా అత్యాచారం, సామూహిక అత్యాచారం, మైనర్లపై లైంగిక వేధింపులు వంటి వికృత చేష్టలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. మహిళలు, చిన్నారులపై వివక్ష, హింసను నియంత్రించేందుకు తక్షణమే సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని మమత సర్కార్‌కు సూచించారు.