ఉద్యోగం తీసిస్తానని ఓ కౌన్సిలరు డబ్బులు తీసుకున్నారు. అధికారులేమో గుర్తింపుకార్డులిచ్చి.. పనులు కేటాయించారు. 24 నెలలు పనిచేశాక ఇళ్లకు పంపేశారు. ఇలా రెండేళ్ల పనికి జీతమూ లేదు. ఉద్యోగానికి ఇచ్చిన డబ్బులూ పోయాయి. ఉద్యోగమూ లేదు. ఇలా అన్ని విధాలా మోసపోయామంటున్నారు బాధితులు. వీరు బుధవారం మీడియాతో మాట్లాడారు. పలమనేరు మున్సిపాలిటీలో ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని, పీఎఫ్, సెలవులు వంటి ప్రయోజనాలు ఉంటాయని జండామఠం ప్రాంతానికి చెందిన ఓ కౌన్సిలరు తమను నమ్మించినట్లు బాధితులు తెలిపారు. వాటర్ వర్క్సులో పనికోసం తమ వద్ద డబ్బు వసూలు చేశారన్నారు. తామంతా అప్పు చేసి డబ్బు కట్టి 2022 జూలైలో ఉద్యోగాల్లో చేరారు. వీరిలో ఆర్.మొగిలీశ్వర్ రూ.2.20 లక్షలు.. జె.అన్సర్ బాషా, ఎస్.ముబారక్ రూ.1.10 లక్షలు చొప్పున.. ఎస్.సమీర్ రూ.1.50 లక్షలు కట్టినట్లు చెప్పారు. వీరిలో ఆర్.మొగిలీశ్వర్‌కు గడ్డూరులోని జగనన్న కాలనీలో.. మిగిలిన ముగ్గురికి కురప్పల్లి జగనన్నకాలనీలో వాటర్ వర్క్సుకోసం పనులు అప్పగించారు. ఈ మేరకు అప్పటి కమిషనరు కిరణ్‌కుమార్ గుర్తింపు కార్డులు జారీ చేశారు. వీరిలో సమీర్ తండ్రి అన్వర్‌బాషా మున్సిపాలిటీలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బులు కట్టి కురప్పల్లి జగనన్న కాలనీలో తాగునీటి సరఫరా పనులు చేస్తూ చనిపోయాడు. దీంతో ఎస్.సమీర్‌ను పిలిపించి అతడి తండ్రికి ఇచ్చిన గుర్తింపుకార్డు తీసుకొని సమీర్ పేరున గుర్తింపు కార్డు ఇచ్చారు. ఇలా వీరంతా 24 నెలలు పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముందు అప్పటి కమిషనరు బదిలీ కావడంతో, ఈ నలుగురిని ఇళ్లకు పంపించారు. వీరు పనిచేసిన దాదాపు 24 నెలలకు చిల్లిగవ్వకూడా ఇవ్వలేదు. ఒక్కొక్కరికి నెలకు దాదాపు రూ.17 వేలు ఇవ్వాల్సి ఉంది. కట్టిన డబ్బులు పోయి.. రెండేళ్ల పనికి జీతం లేక.. చివరకు ఉద్యోగమూ పోవడంతో నిలువునా మోసపోయామంటూ వారు ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం ఇలా ఉద్యోగంలో తీసుకునే వెసులుబాటు లేదని అంటున్నారు. అలాంటప్పుడు ఒక కౌన్సిలరు మాటతో వీరిని ఎలా చేర్చుకున్నారు? పనులు ఎలా అప్పగించారు? ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనేది చర్చనీయాంశంగా మారింది.