శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట వంద పడకల ఆసుపత్రిలో సుమారు రెండు గంటల పాటు రోగులు, నవజాత శిశువులు ఉక్క పోతకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. సాయంత్రం గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 6.30 గంటల నుంచి 8.30 గంటలు వరకు వందపడకల ఆసుపత్రి పరిసరాల్లో విద్యుత్ లేకపోవడంతో రోగులు, శిశువులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రిలో ఇన్వర్టర్ ఉన్నా అది వైద్యులు గదులకు, అత్యవసర విభాగానికే పరిమితం కావడంతో మిగిలిన ఆసుపత్రి ఆవ రణ అంతా చిమ్మ చీకటిలోనే మగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒక పక్క దోమల మోత.. మరో పక్క ఉక్క పోతతో రోగులు, వారి సహాయకులు పడిన ఇబ్బందులు వర్ణనా తీతం. ఇటీవల ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆసుపత్రికి జనరేటర్ సదుపాయం పునరుద్ధరించాలని ఆదేశించినా ఆసుపత్రి అధికారులు పట్టించు కోకపోవడం గమనా ర్హం. ఈవిషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ జయశ్రీ వద్ద ప్రస్తావించగా జనరేటర్ నుంచి ఆసుపత్రికి కేబుల్ వేసేందుకు రూ.1.8 లక్షల వ్యయమవు తుంద న్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తం ఖర్చు చేసేందుకు అవకాశం లేదని, కలెక్టర్, డీసీహెచ్‌ఎస్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశామన్నారు. వారి నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.