ఎమ్మెల్సీ పదవితోపాటు వైసీపీకి కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్‌కు, పార్టీ అధినేత జగన్‌కు బుధవారమే ఆమె లేఖలు పంపారు. సునీత 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో సునీత వైసీపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా వరుదు కల్యాణికి ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో సునీత తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సునీత తన భవిష్యత్ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆమె బీజేపీలో చేరనున్నట్లు అనుచరులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.